26, జులై 2012, గురువారం

దర్గాల సందర్శన


దర్గాల సందర్శన (జియారత్)

అసలు కారణం
ఔలియాల దర్గా ల సందర్శన అసలు కారణం ధార్మిక చింతన పెంపొందించడం, పెద్దవారి చరిత్రలను గుర్తుంచుకొని, వారు నడచిన ధార్మిక మార్గాలలో నడచి అల్లా ను ప్రసన్నం చేసుకోవడం. మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. ఏనాటికైనా మరణిస్తాననే ఆలోచన వస్తే, మనిషి  ధర్మమార్గాన్ని ఆచరించటానికి ప్రయత్నిస్తాడు. 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించి, పాప కర్మలకు దూరంగా వుంటూ సత్యమైన జీవితాన్ని గడుపుతాడు.
కానీ ఏం జరుగుతోంది?
ఇక్కడకు వచ్చిన భక్తుల బాధలను, ఆరోగ్య సమస్యలను భూత ప్రేత గ్రహబాధలను ఔలియాలు  సమాధి నుండే తొలగించి రక్షిస్తారని పిచ్చిపట్టినవారు, మానసిక ప్రశాంతత లేనివారు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నట్లయితే మంచివారుగా మారుతారని  నమ్ముతున్నారు. దర్గాలో పెద్దపండుగలాగా నిర్వహించే ఉరుసు ఉత్సవంలో నమాజు చదివించి బెల్లం, మిఠాయిలు, జిలేబీలు, గులాబీలు, మల్లెపూలు సమాధుల వద్ద సమర్పిస్తున్నారు. ఉరుసు ఉత్సవంలో సుగంధ పరిమళాలు, గులాబీలతో కలిపిన గంధాన్ని తీసుకుని వస్తారు.పవిత్ర గ్రంథాన్ని మోసుకొని వస్తున్న వ్యక్తిని, అతని తలపై ఉన్న గంధాన్ని తాకుతారు. గంధాన్ని స్పృశించిన భక్తులు పునీతులవుతారని నమ్ముతున్నారు.సినిమాలు బాగాఆడాలనీ,ఎన్నికల్లో గెలవాలనీ స్వార్ధపూరిత కోరికలు ఏకంగా సమాధిలోని సర్వ సంఘ పరిత్యాగులైన ఫకీరు భక్తుల్నేకోరుతున్నారు.
ఏం చెయ్యొచ్చు?
సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చు.సమాధులలో ఉన్నవారి మోక్ష సిద్ధి కోసం ప్రార్థన చేయవచ్చు.సమాధులలో ఉన్నవారి పేర్ల దాన ధర్మాలు చేయవచ్చు.సమాధుల దగ్గర  ఖురాన్ పఠించవచ్చు.ఔలియాలు గౌరవనీయులు, వారినీ వారి సమాధులనూ గౌరవించాలి.
ఏం చెయ్యకూడదు?
 ఔలియాల సమాధులకు సాష్టాంగ ప్రమాణాలు చేయరాదు.ఔలియాలకు నోములు (మన్నత్ లు) నోయకూడదు. తల నీలాలు సమర్పించకూదదు. ఔలియాలకు ప్రార్థనలు చేయకూడదు.ప్రార్థనలు ఆలకించేవాడు  అల్లా ఒక్కడే.ఔలియా సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయరాదు.ఔలియాల  సమాధులే సర్వస్వం అన్నట్లు సమాధుల వద్ద స్థోత్ర గీతాలు (మన్ ఖబత్ లు) పాడుకుంటూ వుండి పోయి అసలుదేవుడైన అల్లా ను మరచిపోకూడదు. కాదు.అల్లా ప్రసన్నత పొందటానికి ఇవి ద్వారాలు కాదు.ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు.ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ విశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగి 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.అందుకే ముహమ్మదు గారు తన సమాధిని దర్గా లాగా చేయటానికి అనుమతించలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి